Tholi Chupu

అసలు చూపుకింత శక్తి ఉందని నాకింతకముందు తెలీదు
తెల్లవారు లేచిన మొదలు అనేకం చూస్తూ ఉంటాను
అనేక మంది నన్ను చూస్తుంటారు
ఆ చూసే వాళ్ళలో అమ్మాయిలూ ఉంటారు
కానీ నువ్వు చూసిన రోజున, తొలిసారిగా నన్ను చూసిన రోజున నాకు తెలిసింది
చూపుకు ఉన్న శక్తి ఏమిటో
నిజంగా చూపుకి ఇంత శక్తి ఉందని నాకు తెలీదు
చూపు చుట్టరికం కలుపుతుందని కూడా నాకు తెలీదు
నువ్ మాములుగా చూసుండచ్చు
కానీ ఆ చూపు నాకు మాములుగా లేదు
ఏ మూలనో తాకింది ఆ చూపు
బహుశా అది తాకిన చోటు పేరే హృదయమేమో
ఇంతకు ముందు హృదయాన్ని గురించి కూడా నేను ఎక్కువ ఆలోచించలేదు
ఇప్పుడు ఆలోచించక తప్పటం లేదు
నీ చూపును వర్ణించాలంటే నా చదువు చాలదు
నీ చూపుకు అర్థం చెప్పాలంటే నా అనుభవం సరిపోదు
ఆ చూపులో త్యాగరాజు కీర్తనంత మర్యాద ఉంది
అష్టపది అంత అల్లరి ఉంది
నెంజిళ్లు ఒలకబోసే క్షేత్రయ్య గారి జాణతనమూ ఉంది
నీ కళ్ళు వినీల గగనాలు
లోతు అందని నిగూఢ గహనాలు
నీ నేత్ర గోళం నుంచి ఎదో ఉల్కాపాతం జరిగినట్టు ఉలిక్కి పడ్డాను
ఎదో flying saucer దూసుకొచ్చినట్టు, మనుసా! వెనకడుగు వేశాను
ఆ చూపులో ప్రపంచ సాహిత్యమంతా ఉంది
మౌనమై మాట ఉంది
పలుకలేని పాట ఉంది
చూఛాయిగా అదుపూ ఉంది, కొసరంత కోపమూ ఉంది
నాకే తెలియని నా పొగరుకో హెచ్చరికా ఉంది
ముద్రించని ప్రేమ లేఖా ఉంది
నేనాశించే రూపు రేఖా కూడా ఉంది
ఆ చూపులో ప్రకృతి ఉంది, పార్వతి ఉంది
మహాలక్ష్మి ఉంది, మౌన సరస్వతి ఉంది
ఆ క్షణంలో నిన్ను చూస్తే నా చూపు నీ అందానికి హారతి పట్టింది
నా జన్మకు ఇప్పుడే గతి కూడా పుట్టింది

ఇవన్నీ నిజమా? లేక నా భ్రమా?
నీ అందంలో ఆహ్వానం కనిపించినట్లు కలగన్నానా?
ఏమో! కాలమే తేల్చాలి
అసలు నువ్ నన్నెందుకు చూశావ్
ఎవరైనా ఎందుకు చూస్తారు
ఇతర చూపుల్తో నీ చూపుకు సంబంధం లేదు
ఆ చూపు కావల్సిందడిగి, కనుమూసే చూపు
నీది ఇది కావాలి అని చెప్పని, నేనేం కావాలి అని అడగని
నువు కావాలి అని విప్పి చెప్పని పొడుపు కథ
నీ చూపు ఒక్క క్షణమే
కానీ ఆ తాకిడి నాకు అనుక్షణం
ఆ చూపు ఒక ఋతుపవనం
శతమర్కట సమానమైన ఈ బ్రహ్మచర్యానికి
శివధర్నుభంగానికి ముందు సీతామహాలక్ష్మి లాంటిది
వ్రత భంగం చేసుకోవచ్చని ఆజ్ఞ
ఇంకో తమాషా ఉంది తెలుసా?
ఇప్పుడు నేను కృష్ణ మురళి చెవి సోకిన రాధ
రామ పాదం పొడసోకిన అహల్య
జగన్మాత చేతి చలువ సోకిన శివుడ్ని
అమృత భాండం అసురలకందకుండా మాయ చేసిన మాధవ మోహినిని
అవును, నిజమే! నే స్త్రీని
సూర్య కిరణాల్లాంటి నీ చూపుకి
ఆ ఉదయ పద్మం వికసించింది
విదియ చంద్రిక లాంటి నీ పొదుపైన నవ్వుకి
కలల కోనేటిలో కలువనై కలవరించాను నేను
వరించానేమో నిన్ను అంటే? అపరాధమేమో?
నీ చూపు అవును, కాదుల అర్థాంగీకారం
అది ఉండీ లేని ఊహా శృంగారం
నీ చూపు మౌన పురాణానికి పీఠిక
నా హృదాయాలయంలో జీవన జ్యోతి
మౌనమైన చూపుతోనే గానం వినిపించావు నువ్వు
జీవనరాగం ఇప్పుడే మొదలైంది
కుడి ఎడమల కుసుమ పరాగం అప్పుడే జరిగిపోయింది
ఏదీ, ఏదీ మళ్ళీ ఇంకొక్కసారి చూడు



Credits
Writer(s): Vetoori, Suresh Vishwa
Lyrics powered by www.musixmatch.com

Link